CV Anand: సంధ్య థియేటర్ ఘటన.. బాలుడి ఆరోగ్య పరిస్థితి వెల్లడించిన సీపీ
హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌కు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినాతో కలిసి బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు. ‘‘13 రోజులుగా బాలుడికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. డిసెంబరు 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్‌కు ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయింది. వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. పూర్తిగా కోలుకునేందుకు సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులిటెన్ విడుదల చేస్తారు’’ అని సీపీ తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.