పుష్ప-2 బెనిఫిట్ షో కోసం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్దకు బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో వచ్చిన చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయడంతో రేవతి(35) అనే మహిళతోపాటు ఆమె కుమారుడు శ్రీతేజ(9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. ఇద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. హుటాహుటిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి మృతిచెందారు. కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్‌కు తరలించారు. పుష్ప-2 సినిమా చూసేందుకు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు రాగా... తల్లి కుమారుడు తొక్కిసలాటలో చిక్కుకున్నారు. వారిలో తల్లి మృత్యువాతపడటం విషాదాన్ని నింపింది. తొక్కిసలాటలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.