తెలంగాణలో వర్షపాతం సాధారణం కంటే తగ్గడం, పలు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 12న మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సవాళ్లు, సాగునీటి లభ్యత, తాగునీటి సరఫరా, పెరుగుతున్న విద్యుత్ అవసరాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో సుమారు 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు, దాదాపు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు అంచనా వేశారు. బాధిత రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు కరువు ప్రాంతాల గుర్తింపుపై కేంద్రం సహకారాన్ని ప్రభుత్వం కోరింది. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రతిపాదించింది.