రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు నిరసిస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ర్యాలీగా బయలుదేరి ఏఈ కార్యాలయాలకు చేరుకుని.. విద్యుత్ చార్జీలు తగ్గించాలని వినతి పత్రం అందజేశారు. నగరిలో జరిగిన నిరసనల్లో మాజీ మంత్రి, వైఎస్ఆర్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బైక్ ర్యాలీ నిర్వహించి.. నగరి కూడలిలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని రోజా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏం జరిగినా వైఎస్ జగన్మోహన్ రెడ్డే కారణమంటున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సిగ్గుందా? అని ప్రశ్నించారు. ‘ఈ రోజు హామీలకు ష్యూరిటీ లేదు, ఆయన మాటలకు గ్యారంటీ లేదు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు. ఈ రోజు వీధి వీధికి మధ్యం షాపులు పెట్టి ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు.’ అని ఆరోపించారు.