తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి ప్రధాన బాధ్యులైన తిరుపతి (క్రైం) డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిలను సస్పెండ్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి (సీవీఎస్‌వో) శ్రీధర్, జేఈవో గౌతమిపై బదిలీ వేటు వేశారు. ఈ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. తొక్కిసలాటలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారంతో పాటు ఆయా కుటుంబాల్లోని ఒకరికి ఒప్పంద ప్రాతిపదికన తితిదేలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. వారి ఆరోగ్య స్థితి మెరుగుపడే వరకు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. స్వల్పంగా గాయపడ్డ 33 మంది బాధితులకు రూ.2 లక్షల చొప్పున పరిహారమిస్తున్నట్లు చెప్పారు. అలాగే టీటీడీ అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.