టిక్ టాక్ స్టార్, యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు విశాఖపట్నం పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మైనర్ బాలికను గర్భవతిని చేసిన కేసులో ఫన్ బకెట్ భార్గవ్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, 4 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన భార్గవ్ చిప్పాడ.. టిక్ టాక్ వీడియోల ద్వారా ఫన్ బకెట్ భార్గవ్‌గా పాపులర్ అయ్యాడు. అతడికి విశాఖపట్నంలోని సింహగిరికి చెందిన 14 ఏళ్ల బాలిక ఆన్‌లైన్ చాటింగ్‌లో పరిచయం అయ్యింది. ఆమెకు కూడా టిక్ టాక్ వీడియోలు చేయడం ఆసక్తి. దీంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. అయితే, ఈ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ఆ మైనర్ బాలికను భార్గవ్ గర్భవతిని చేశాడు. ఈ క్రమంలో భార్గవ్‌పై బాలిక తల్లిదండ్రులు 2021 ఏప్రిల్ 16న పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్గవ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును విశాఖ సిటీ దిశ పోలీసులు తీసుకున్నారు. అప్పటి నుంచీ ఈ కేసు విచారణ విశాఖ పోక్సో కోర్టులో కొనసాగుతోంది. మధ్యలో భార్గవ్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే, దాదాపు మూడున్నరేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం.. భార్గవ్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు చెప్పింది.