తెలంగాణలోని విద్యాసంస్థల్లో కులవివక్షను నిరోధించడం, విద్యార్థుల హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా ప్రతిపాదించిన రోహిత్ వేముల తెలంగాణ బిల్లు-2026 రూపకల్పనను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. 3 నెలల్లోగా ప్రాథమిక ముసాయిదాను సిద్ధం చేసి సీనియర్ సివిల్ సర్వెంట్ల కమిటీకి సమర్పించాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి, న్యాయశాఖతోపాటు సంబంధిత శాఖలు, సంస్థల భాగస్వామ్యాన్ని పరిశీలించనున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, న్యాయ నిపుణులు, పౌర సమాజ సంస్థల అభిప్రాయాలను సేకరించి ముసాయిదా రూపొందించనున్నారు. న్యాయపరమైన, సాంకేతిక అంశాల్లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం సహకారం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.