AP Urban Local Body Election Results Live Updates: పులివెందులలో కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

3 hours ago 2
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 138 కేంద్రాల్లో నిర్వహించే కౌంటింగ్‌కు 47,817 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొంటున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో రాత్రి 8 గంటల్లోగా ఫలితాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఓట్ల లెక్కింపు కోసం ముందుగా బ్యాలట్‌ పత్రాలను 25 చొప్పున కట్టలుగా కడతారు. డివిజన్లు/వార్డుల్లో ఓట్ల ఆధారంగా బ్యాలట్‌ పత్రాలు కట్టలు కట్టే ప్రక్రియ ఉంటుంది. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలట్‌ పత్రాల లెక్కింపు మొదలవుతుంది.. ఈ పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి ప్రతి కవరు నుంచి డిక్లరేషన్‌ పత్రాన్ని తీసి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ తర్వాత .. పోలైన మొత్తం ఓట్లు, అభ్యర్థుల వారీగా ఎవరెకిన్ని వచ్చాయో రిటర్నింగ్ అధికారి వెల్లడిస్తారు. ఒకవేళ అభ్యర్థి రీకౌంటింగ్ కావాలనుకుంటే దరఖాస్తు చేసుకోవడానికి 15 నిమిషాల సమయం ఉంటుంది. సరైన కారణం ఉంటేనే రిటర్నింగ్‌ అధికారి రీ కౌంటింగ్‌కు అనుమతిస్తారు. రీకౌంటింగ్‌లో పోస్టల్‌ బ్యాలట్‌తో సహా అన్నీ మళ్లీ లెక్కించిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 13 కార్పొరేషన్ స్థానాలకు పోలింగ్ జరిగింది.. కూటమి నుంచి టీడీపీ 10 చోట్ల, జనసేన 2 స్థానాల్లో, బీజేపీ ఒకచోట పోటీ చేశాయి. వైఎస్సార్‌సీపీ 13 కార్పొరేషన్లలో పోటీకి దిగింది. 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్‌పర్సన్‌ స్థానాలలో 17చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 70 ఛైర్‌పర్సన్‌ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు 49చోట్ల, జనసేన నుంచి 17, బీజేపీ నుంచి నాలుగు స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 70 చోట్ల పోటీ చేశారు. కూటమి ఈ రెండున్నరేళ్ల సంక్షేమం, అభివృద్ధి తమను గెలిపిస్తుందని చెబుతుంటే.. వైఎస్సార్‌సీపీ తాము కూడా గట్టి పోటీ ఇస్తామంటోంది. ఈ కౌంటింగ్‌ కోసం SEC భారీ ఏర్పాట్లు చేసింది.. అలాగే పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు.

విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లు సహా మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ఈ లైవ్ బ్లాగ్ ద్వారా అందిస్తాం.
Read Entire Article