హైదరాబాద్–పుణె–ముంబయి నగరాలను అనుసంధానించే బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా వికారాబాద్ జిల్లా అనంతగిరిలో స్టేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మొయినాబాద్ పరిసరాల్లో ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహిస్తూ మార్గంలోని భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం వికారాబాద్ నుంచి ముంబయికి రైలులో 10 నుంచి 15 గంటలు పడుతుండగా.. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే సుమారు మూడు గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా. ఈ ప్రాజెక్టుతో వికారాబాద్ జిల్లా పర్యాటక, ఆర్థిక అభివృద్ధికి ఊతం లభించనుంది. అయితే తుది మార్గం, స్టేషన్, భూసేకరణ వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.