హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి ప్రజా రవాణా కొరత, ప్రైవేటు వాహనాలపై ఆధారపడటం ప్రధాన కారణాలని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రతి 100 మందికి 70 ప్రైవేటు వాహనాలు ఉన్నాయని, సింగపూర్, షాంఘై, లండన్, న్యూయార్క్‌తో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువని తెలిపారు. మెట్రో, ఆర్టీసీ సేవలు ఉన్నప్పటికీ ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ, సమయపాలన, అదనపు ఖర్చుల సమస్యలతో ప్రజలు సొంత వాహనాలను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల ట్రాఫిక్‌తో పాటు కాలుష్యం కూడా పెరుగుతోందని వివరించారు.