విశాఖపట్నంలో సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజ రూపాన్ని చూసేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరికొంతమంది భక్తులు గాయపడ్డారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి 300 రూపాయల టికెట్ క్యూలైన్‌పై భారీ గోడ కూలింది. క్షతగాత్రులను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, అధికారులు ఆస్పత్రికి తరలించారు. సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే రూట్‌లో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర భారీ గోడ కూలింది. 300 రూపాయల క్యూలైన్‌లో మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా భారీ గోడ కూలిపోయింది. విషయం తెలియగానే NDRF సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు చిద్రమయ్యాయి. ఈ ఘటనలో చనిపోయిన ఏడుగురు మృతదేహాలను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.