కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటారనే నమ్మకంతో అప్పు ఇస్తే.. ఆ డబ్బును ఎగ్గొట్టడానికి ప్రాణాలు తీసే స్థాయికి మనుషులు దిగజారుతున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో ఇలాంటి ఘోరమే జరిగింది. గంగామణి అనే మహిళ దగ్గర అప్పు తీసుకున్న ఆమె స్నేహితులు స్వరూప, లావణ్య, ప్రేమల ఆ బాకీని తీర్చలేక ఆమెను చంపాలని ప్లాన్ వేశారు. పచ్చబొట్టు వేయించుకుందామని నమ్మించి బాసరకు తీసుకెళ్లి.. అక్కడ ఆమెకు మద్యం తాగించారు. అనంతరం గంగామణి తలపై బలమైన ఆయుధంతో కొట్టి చంపి.. మృతదేహాన్ని వాగులో పడేశారు. నమ్మిన స్నేహితులే కాలయములై ప్రాణాలు తీయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ రోజుల్లో ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సామాజిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.