రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల నిర్మాణం చేపడతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సచివాలయంలో అధికారులు నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మొదటి దశలో రూ.10,986 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో టెండర్లు ఆహ్వానించనున్నామని తెలిపారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు వరుసల హ్యామ్ రోడ్లు నిర్మించనున్నామని మంత్రి వివరించారు.