ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ టీచర్ గౌతమి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వ్యవహారం వివాదాస్పదమైంది. పాఠశాల పనివేళల్లో పాఠాలు చెప్పకుండా.. ప్రైవేటు సంస్థల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ వీడియోలు తీసినందుకు అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు. ఈ చర్యపై గౌతమి తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ మరో వీడియో విడుదల చేశారు. ‘నేనేమీ గంజాయి అమ్మలేదు, ఎవరినీ చంపలేదు.. తెలియక చేసిన తప్పుకు ఇంతలా ట్రోలింగ్ చేస్తారా?" అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఆత్మహత్య చేసుకోవాలన్నంత బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠినంగా ఉంటామని అధికారులు హెచ్చరించగా.. బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సోషల్ మీడియా మోజులో పడటం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.