Karimnagar Okra: బెండ మొక్క ఏకంగా 12 అడుగులు పెరిగింది. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మొక్కకు కాసిన బెండకాయలు కూడా సాధారణకంటే పొడవుగా ఉండటం మరో విశేషం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ఓ ఇంట్లో కాస్తున్న బెండకాయలు స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నాయి. సుల్తానాబాద్ పట్టణంలో కొయ్యాడ రమేష్ ఇంటి పెరట్లో పెరిగిన బెండ మొక్క ఏకంగా 12 అడుగుల పొడవు ఉంది. ఆ మొక్కకు గుత్తులు గుత్తులుగా బెండకాయలు కాస్తున్నాయి. బెండకాయల బరువుకి మొక్క వంగిపోవడంతో దానికి తాడు కట్టి రమేష్ సంరక్షిస్తున్నారు. ఈ మొక్కకు కాస్తున్న ఒక్కో బెండకాయ ఒక అడుగు పొడవు ఉంటుందని రమేష్ చెబుతున్నారు. బెండ మొక్కలు సాధారణంగా 3 నుంచి 6 అడుగుల వరకు మాత్రమే పెరుగుతాయి. అయితే, ఈ మొక్క 12 అడుగుల పొడవు ఉంది. ఇలాంటి అరుదైన మొక్క తమ పెరట్లో పెరగడం చాలా సంతోషంగా ఉందని రమేష్ అన్నారు.