ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఎవరూ మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని హెచ్చరించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని పేర్కొంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైదుకూరు పర్యటనలో ఉన్నప్పుడు టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. నారా లోకేశ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ తర్వాత పలువురు నేతలు ఇదే అంశంపై బహిరంగంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని టీడీపీ అధిష్ఠానం భావించింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై కూటమి నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టత ఇచ్చింది.