ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలోని గుర్ల మండలం కెల్ల వద్ద సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. సుమారుగా 8 వేల కోట్ల పెట్టుబడితో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. రెండు దశలలో ఈ నిర్మాణం పూర్తి చేయనున్నారు. దీని ద్వారా 750 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ విషయాన్ని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు వెల్లడించారు.