రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాలలో కారవాన్ పార్కుల ఏర్పాటుకు ఆలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే అల్లూరి జిల్లా లంబసింగి వద్ద కారవాన్ పార్క్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే తాజంగి సమీపంలో భూమిని గుర్తించగా.. పర్యాటక శాఖ సీనియర్ అధికారులు ఇటీవల ఈ ప్రాంతంలో పర్యటించి కారవాన్ పార్కు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. కారవాన్ పార్కుల ద్వారా పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచాలనేది ప్రభుత్వం ఉద్దేశం.