గంజాయి రవాణాపై పోలీసులు ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో గంజాయి స్మగ్లర్లు కొత్త ప్లాన్లు వేస్తున్నారు. ఈసారి గంజాయి స్మగ్లర్లు మీడియా ముసుగులో రవాణా ప్రారంభించారు. కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు వరుసగా నాలుగు సార్లు మీడియా ముసుగులో ప్లాన్ వర్కౌట్ చేసినా.. ఐదోసారి మాత్రం పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కియా కారుపై ఓ ప్రముఖ మీడియా సంస్థ లోగోను వెనుక ముందు అద్దాలపై అతికించి గంజాయి స్మగ్లింగ్ చేశారు. కార్లు అద్దెకి ఇచ్చే టూరిస్ట్ యాప్‌లో తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన కారును 10 రోజులు పాటు బుక్ చేసుకుని.. దానికి ఆంధ్ర రిజిస్ట్రేషన్ కలిగిన నెంబర్ బోర్డును తగిలించారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలం అంబేరుపాడు గ్రామానికి చెందిన వ్యక్తులతో కలిసి ఒరిస్సా పరిసర ప్రాంతాలలో 205 కేజీలు గాంజాయిని 10 లక్షల 25 వేలుకు కొనుగోలు చేశారు. మీడియా వెహికల్ అయితే ఎవరు అనుమానించారని, తనిఖీలు కూడా చేయరని భావించి కారణంతో కారుకు మీడియా స్టిక్కర్లు అతికించి అల్లూరు జిల్లా నుంచి నర్సీపట్నం వైపు బయలుదేరారు. కారు నర్సీపట్నం శివారు నెల్లిమెట్ట గ్రామానికి చేరుకునే సమయంలో పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను, మోటార్ బైక్‌పై ప్రయాణిస్తున్న మరో వ్యక్తిని అరెస్టు చేశారు. గంజాయితో ఉన్నా కియా కారుతో పాటు ఒక మోటార్ బైక్ సెల్ ఫోన్, 1500 క్యాష్ స్వాధీనం చేసుకున్నారు.