కలెక్టరేట్‌లో కీలకమైన సమావేశానికి హాజరైన ఓ ఉన్నతాధికారి.. అధికారులంతా వారి విధుల్లో బిజీగా ఉంటే ఆయన మొబైల్‌లో మునిగి తేలుతున్నారు. ఏం చేస్తున్నారా అని చూస్తే.. అధికారి బాగోతం బయటపడింది.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అనంతపురం లెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. కీలమైన సమావేశం కావడంతో కలెక్టర్లు, జిల్లా పోలీసులు, పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో.. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు పలు సంఘాల నేతలు వచ్చారు. అయితే ఈ సమావేశానికి హాజరైన అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌వో) మలోలా మొబైల్‌లో రమ్మీ ఆడుకుంటూ కూర్చున్నారు. ఓ వైపు కలెక్టర్లు సహా అధికారులంతా ముఖ్యమైన సమావేశంలో బిజీగా ఉంటే.. సారు గారు మాత్రం తనకేమి పట్టనట్లు రమ్మీ ఆడుతూ బిజీ బిజీగా గడిపారు. తన మొబైల్‌లో రమ్మీ ఆడుతూ వేరే ప్రపంచంలో మునిగిపోయినట్లు కనిపించారు.