డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకుల్ని మోసం చేస్తున్న ముఠా గుట్టును తిరుపతి పోలీసులు బట్టబయలు చేశారు. కొంతమంది కేటుగాళ్లు ఢిల్లీ సీబీఐ అధికారులమంటూ బెదిరించి తిరుపతి త్యాగరాజనగర్‌కు చెందిన 65 ఏళ్ల మహిళ నుంచి 2 కోట్ల 50 లక్షల రూపాయలు నొక్కేశారు. బాధితురాలికి తొలుత వీడియో కాల్ చేసిన కేటుగాళ్లు.. మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా 200 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని.. ఇది మనీలాండరింగ్ కిందకు వస్తుందని బెదిరించారు. ఆ తర్వాత ఆ మహిళ నుంచి డబ్బులు కాజేశారు. మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితులు రాజమండ్రికి చెందిన వినయ్ కుమార్, అతని సోదరుడు వైజాగ్‌కు చెందిన అరుణ్ కుమార్‌గా గుర్తించారు. అయితే నిందితుల్లో ఒకరైన వినయ్ థాయ్‌ల్యాండ్‌కు నగదు తీసుకుని పారిపోగా.. అరుణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వినయ్ థాయ్‌లాండ్ వెళ్లే ముందు తన సోదరుడు అరుణ్‌కి ఒక ఎక్స్‌యూవీ 7 డబుల్ ఓ కారు కొనిచ్చాడు. ఆ కారుతో పాటు 24 లక్షల నగదు, రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, 16 గ్రాముల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు.