హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాలిథిన్ సంచులు తయారు చేసే ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్ పరిశ్రమలో మంటలు అంటున్నాయి. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మంగళవారం (నవంబర్ 26) మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరగ్గా.. అప్పటి నుంచి మంటలను అదుపు చేసేందుకు ఫైర్ డిపార్ట్‌మెంట్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. నేడు మధ్యాహ్నానికి మంటలు పూర్తిగా ఆర్పే అవకాశముంది. నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో సిబ్బంది మంటలను అదుపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పక్కన ఉన్న కంపెనీలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు.