హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లో పరిపాలనను సులభతరం చేసేందుకు ప్రభుత్వం అధికార వికేంద్రీకరణకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం 10,472 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ సంస్థను 12 జోన్లుగా విభజించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనివల్ల సంగారెడ్డి, యాదాద్రి వంటి దూర ప్రాంతాల ప్రజలు ప్రతి చిన్న పని కోసం హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉండదు. ప్రతి జోన్‌కు ప్రత్యేకంగా కమిషనర్, ప్లానింగ్ అధికారులు , ఇంజనీర్లను నియమించడం ద్వారా భవన నిర్మాణ అనుమతులు ఎక్కడికక్కడే లభిస్తాయి. కేవలం భారీ ప్రాజెక్టులు మాత్రమే ప్రధాన కార్యాలయానికి వస్తాయి. ఈ మార్పుల వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా.. శివారు ప్రాంతాల అభివృద్ధి వేగవంతం కానుంది.