అనకాపల్లి జిల్లాలో 25 వేల కిలోల పశువుల మాంసాన్ని పోలీసులు సీజ్ చేశారు. పశ్చిమబెంగాల్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తోన్న గొడ్డు మాంసాన్ని పోలీసులు గుర్తించారు. పశువుల మాంసం తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నక్కపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వేంపాడు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఓ కంటైనర్ మీద అనుమానం వచ్చింది. అనుమానాస్పదంగా ఉన్న కంటైనర్‌ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. ప్లాస్టిక్ సంచులు, అట్ట పెట్టెల్లో పకడ్బందీగా ప్యాక్ చేసిన పశువుల మాంసాన్ని గుర్తించారు. ఈ మాంసాన్ని స్వాధీనం చేసుకుని రెవిన్యూ అధికారుల సమక్షంలో పూడ్చిపెట్టారు. డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు నక్కపల్లి సీఐ కుమారస్వామి వెల్లడించారు.