తెలంగాణలో ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీజీ-టీమార్స్ అనే ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ విభాగానికి ఏడీజీపీ, ఐజీపీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. రాష్ట్రంలోని 32 వేల కిలోమీటర్లకు పైగా రహదారులు, 1.8 కోట్లకు పైగా వాహనాల ట్రాఫిక్ నిర్వహణపై ఈ బ్యూరో పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి పోలీస్ స్టేషన్‌లో రోడ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్‌ను నియమించి ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకోనున్నారు. ORR, హైవేలపై ప్రత్యేక పెట్రోలింగ్ యూనిట్లు, ఆధునిక కెమెరాలు, స్పీడ్ డిటెక్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ జరిమానాల్లో 40 శాతం స్పెషల్ ఫండ్‌కు మళ్లించి సాంకేతిక పరికరాలు, శిక్షణ, పెట్రోలింగ్, అత్యవసర రోడ్డు పనులకు వినియోగించనున్నారు.