డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో రవాణా శాఖ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. పర్మినెంట్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునే వారు ముందుగా మూడు గంటలపాటు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన వీడియో పాఠాలు వీక్షించాలి. వాటికి హాజరైన వారినే డ్రైవింగ్ ట్రాక్ టెస్ట్‌కు అనుమతిస్తారు. తొలుత కూకట్‌పల్లి ఆర్టీఏ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. విజయవంతమైతే గ్రేటర్ పరిధిలోని ఇతర జోనల్ కార్యాలయాలకు విస్తరించనున్నారు. మధ్యవర్తుల ప్రమేయం, డ్రైవింగ్ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు లైసెన్స్‌దారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.