బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావం తెలంగాణపై మంగళవారం నుంచి కనిపించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు. గురువారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడవచ్చని అంచనా. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలన్నారు.