తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో 111 మండలాల్లో తీవ్ర కరువు, 254 మండలాల్లో మధ్యస్థ కరవు పరిస్థితులు ఉన్నట్లు వెల్లడించింది. ఎల్నినో ప్రభావంతో వానాకాలంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. బాధిత రైతుల ఖాతాల్లోకి నేరుగా పెట్టుబడి రాయితీ, పంట రుణాల రీషెడ్యూల్, పశుగ్రాసం, తాగునీటి సరఫరా, ఉపాధి పనులు కల్పించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు కరువు నివారణ చర్యల కోసం కేంద్రం నుంచి రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీతో పాటు అదనపు విద్యుత్, ఎరువులు, ఆర్థిక సహాయం అందించాలని కోరింది.