తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో ఆధునికీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రూ.27 కోట్లతో చేపట్టిన వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్‌లో ఎస్కలేటర్, రెండు లిఫ్టులు, క్యాంటీన్, దివ్యాంగులకు ఆధునిక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తవుతాయని కిషన్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి రైల్వే కనెక్టివిటీ ఎంతో కీలకమని, ఆధునికీకరణతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు.