తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం జులై 15 నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగిన ఉద్యోగుల హెల్త్‌కేర్ ట్రస్ట్ తొలి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఒక్కరి నుంచి మాత్రమే చందా వసూలు చేయాలని గత నెలలో అదనంగా మినహాయించిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చికిత్స గరిష్ఠ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని మరిన్ని వ్యాధులు, ఆసుపత్రులను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని వివిధ సంఘాల నాయకులు ఈ సందర్భంగా అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.