తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం రాజకీయంగా వేడెక్కుతోంది. గతంలో జరిగిన అశాస్త్రీయ విభజన వల్ల పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయని, అందుకే రిటైర్డ్ అధికారుల కమిటీతో జిల్లాల సరిహద్దులను సవరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో జనగామ జిల్లా రద్దు కాబోతోందని వస్తున్న వార్తలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. జనగామ జిల్లాను కాపాడుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి పొంగులేటి అసెంబ్లీలో ప్రస్తావించినప్పటి నుంచే ఈ చర్చ ఊపందుకుంది. కేవలం రాజకీయాల కోసం కాకుండా, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పరిపాలనా సౌలభ్యం కోసం మార్పులు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.