తెలంగాణలో రబీ వరి సాగు విస్తీర్ణం గత దశాబ్దంలో నాలుగు రెట్లకు పైగా పెరిగింది. 2023–24లో దేశంలోని ప్రధాన రబీ వరి సాగు రాష్ట్రాల మొత్తం విస్తీర్ణంలో తెలంగాణ వాటా 51.38 శాతంగా నమోదైంది. సాగునీటి సౌకర్యాలు, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు భరోసా, రైతుల ప్రాధాన్యం వరి సాగు పెరుగుదలకు దోహదపడ్డాయి. అయితే.. ఎల్ నినో ప్రభావం, నీటి లభ్యతపై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం పంటల మార్పిడిని ప్రోత్సహిస్తోంది. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు పెరగాలంటే గిట్టుబాటు ధరలు, స్థిరమైన మార్కెట్లు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.