తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో నేరుగా భర్తీ చేసే ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని మరో 10 సంవత్సరాల పాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రస్తుతమున్న గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరిగింది. ఈ సడలింపు రాబోయే నోటిఫికేషన్లకు ఏడాది పాటు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే పోలీసు, ఎక్సైజ్ వంటి యూనిఫాం సర్వీసులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొంది.