పసుపు బోర్డు ఏర్పాటును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. అయితే, క్వింటా పసుపుకు రూ. 15 వేల కనీస మద్ధతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని సూచించారు. ఈ రెండు చేసినప్పుడే పసుపు బోర్డుకు సార్థకత ఏర్పాడుతుందని, అప్పుడే పసుపు రైతులకు సంపూర్ణ న్యాయం లభిస్తుందని స్పష్టం చేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేయాలంటూ 2014లో తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశానని గుర్తు చేశారు.