వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అలాగే, రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. తాను పార్టీ మారుతున్నానంటూ కొన్ని ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్ వెంటే ఉంటానన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్‌స్వీప్ చేసేలా కృషి చేస్తామని.. జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. తన మీద తప్పుడు కథనాలు రాసి వ్యూస్ పెంచుకుందామని కొన్ని ఛానల్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయన్నారు. తన మీద వార్త రాయడం వల్ల ఛానల్స్ రేటింగ్ పెరుగుతాయి అంటే రాసుకోవచ్చు అన్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా కొద్ది రోజులు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతాను.. నాన్ స్టాప్ కార్యక్రమాలు చేస్తానన్నారు. పాత కేసుల్లో తనను అక్రమంగా అరెస్టు చేయాలంటూ కొందరు లోకేష్ వెంట తిరుగుతున్నారని.. అధికారం చేతిలో పెట్టుకుని.. నాపై అక్రమ కేసులు పెట్టించి శునకానందం పొందాలని చూస్తున్నారన్నారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి భరిస్తా..తామేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.