ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరలో ఈసారి ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. న్యూజిలాండ్‌కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ మావోరీ (Maori) ఆదివాసీ తెగ ప్రతినిధులు సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద తమ సంప్రదాయ ‘హాకా’ (Haka) నృత్యాన్ని ప్రదర్శించారు. 13వ శతాబ్దంలో పన్నులకు వ్యతిరేకంగా పోరాడిన వనదేవతల చరిత్రను విని పరవశించిన వీరు.. తమ వీరత్వానికి చిహ్నమైన నృత్యంతో అమ్మవార్లకు నివాళులర్పించారు. మంత్రి సీతక్క సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శన, మన మేడారం కీర్తిని ఖండాంతరాలకు చాటిచెప్పింది. గిరిజన సంస్కృతిలో విగ్రహారాధన లేని ఈ జాతర, ప్రకృతిని పూజించే మావోరీ తెగకు.. మన కోయ గిరిజనులకు మధ్య ఉన్న సాంస్కృతిక సారూప్యతను ప్రపంచానికి చాటింది.