Tirupati: చిమ్మ చీకటిలో నిర్మానుష్య ప్రాంతంలో వింత శబ్దాలు, అరుపులు వినిపిస్తే భయంతో పరిగెడతారు. ఇలాంటి శబ్దాలు హారర్ సినిమాల్లో వింటేనే మనకు గుండె ఆగిపోయినంత పనవుతుంది. అలాంటిది నిజజీవితంలో ఇలాంటి అనుభవాలు ఎదురైతే ఎంత భయపడతాం! ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని ఓ గ్రామంలో రాత్రిపూట ఇలాంటి శబ్దాలే వినిపిస్తున్నాయట. గ్రామ శివారులో దెయ్యం తిరుగుతోందని ప్రచారం జరుగుతోంది. రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం పంచాయతీలో ఎల్.వి.పురం గ్రామం కట్లకణం దగ్గర మంగళవారం రాత్రి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులకు చీకట్లో మహిళను పోలి ఉన్న ఆకారం ఒకటి కనిపించిందట. వెంటనే బ్రేక్ వేసి తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్‌తో ఆ ఆకారానికి ఒక ఫొటో తీశారు. వెంటనే ఆ ఆకారం వింత అరుపులతో భయబ్రాంతులకు గురిచేసిందట. బైక్ వెనక్కి తిప్పి పారిపోతుండగా.. స్కిడ్ అయ్యి ఇద్దరూ పడిపోయారు. వెనక కూర్చున్న యువకుడి వీపుపై గాయాలయ్యాయి. ఆ బైక్ పడిపోయిన చోటే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు అంటున్నారు. అదే ప్రాంతంలో కొంతకాలం క్రితం ట్రాక్టర్ బోల్తా పడి బాలిక మృతిచెందిందని చెబుతున్నారు. అయితే, ఆ దారిన వెళ్లేవారు కొంత మంది మాత్రం ఆ ఆకారం దెయ్యం కాదని.. మతిస్థిమితం లేని మహిళ అయ్యుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ఆ మిస్టరీ గుట్టు విప్పి గ్రామస్థుల్లో భయాన్ని పోగొట్టాల్సి ఉంది.