తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖలో దశాబ్దాల నాటి పాత పద్ధతులకు ప్రభుత్వం స్వస్తి పలికింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు ఎత్తైన గద్దెలపై కూర్చునే సంప్రదాయాన్ని రద్దు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై అధికారులు సామాన్యుల తరహాలోనే నేలపై టేబుల్, కుర్చీ వేసుకుని విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రజలకు, అధికారులకు మధ్య దూరాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. అద్దె భవనాల్లో నడుస్తున్న కార్యాలయాలను తక్షణమే ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని కేంద్రాల్లో ఇప్పటికే గద్దెలను తొలగించి, సొంత భవనాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేశారు.