ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సాగునీటి కల ఎట్టకేలకు సాకారమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా చనాకా-కొరాటా పంప్ హౌస్, సదర్మాట్ బ్యారేజీలను ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. హాతీఘాట్ వద్ద స్విచ్ ఆన్ చేసి కాలువలకు నీటిని విడుదల చేయడం ద్వారా సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే గోదావరిపై నిర్మించిన సదర్మాట్ బ్యారేజీ ద్వారా మరో 18,000 ఎకరాలకు లబ్ధి చేకూరనుంది. ఈ ప్రాజెక్టులతో పాటు రూ. 386 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో మెజారిటీ పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.