తెలంగాణలో సీసీఐ (CCI) మరియు జిన్నింగ్ మిల్లుల మధ్య నెలకొన్న వివాదం కారణంగా నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు ఎట్టకేలకు పునఃప్రారంభమయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా జోక్యం చేసుకొని.. సీసీఐ అధికారులతో, కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి నిబంధనలలో మార్పులు చేయించారు. దీంతో రాష్ట్రంలో నోటిఫై చేసిన 330 జిన్నింగ్ మిల్లులు తిరిగి కొనుగోళ్లను ప్రారంభించనున్నాయి. రైతుల వద్ద మిగిలిన మొత్తం పత్తిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.