తెలంగాణలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ సీట్లు భారీగా పెరిగాయి. కొత్తగా 1,010 సీట్లు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోని 66 మెడికల్ కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య 10,450కి చేరింది. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో 4,400, ప్రైవేట్ కాలేజీల్లో 6,050 సీట్లు ఉన్నాయి. కొత్త సీట్ల పెంపులో ప్రైవేట్ కాలేజీల వాటా ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 1,40,214 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. అత్యధిక సీట్లున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. అనుమతించిన సీట్లకు మించి అడ్మిషన్లు ఇస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎన్‌ఎంసీ హెచ్చరించింది.