హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 120 నుంచి 100 కిలోమీటర్లకు తగ్గించాలని పోలీసు, రవాణాశాఖ అధికారులు ప్రతిపాదించారు. 2023 జులైలో వేగ పరిమితి పెంచిన తర్వాత ప్రమాదాలు పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ద్విచక్రవాహనాల ప్రవేశం, జిగ్‌జాగ్ డ్రైవింగ్, వాహనాలను ఆకస్మికంగా నిలపడం వంటి ఉల్లంఘనలపైనా ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం 7–8 పెట్రోలింగ్ వాహనాలే ఉండగా.. కనీసం 30 అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. వేగ పరిమితి తగ్గింపుపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది.