హైదరాబాద్ అశోక్ నగర్ వద్ద హుస్సేన్ సాగర్ నాలాపై నిర్మించిన కొత్త లింక్ బ్రిడ్జిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దాదాపు రూ. 6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన, సిటీ సెంట్రల్ లైబ్రరీ నుండి ఏవీ కాలేజ్ వరకు నేరుగా అనుసంధానాన్ని కల్పిస్తుంది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో చిక్కడపల్లి, దోమలగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా.. లిబర్టీ జంక్షన్ చేరుకోవడానికి ప్రయాణ సమయం 10 నిమిషాలకు తగ్గనుంది. 48 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జి రెండు వైపులా పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేశారు. నగరంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు మరిన్ని లింక్ రోడ్లు నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.