రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ. రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరువేరుస్తామని.. దీనిపై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణమంటే కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే కాదని.. ఇక్కడికి ప్రజలొచ్చి స్థిరపడాలన్నా, యువతకు ఉద్యోగాలు దక్కాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు అవసరమన్నారు. పరిశ్రమల ఏర్పాటుతోనే రైతుల భూములు ధరలు పెరుగుతాయని వివరించారు. కాలుష్యభరిత పరిశ్రమలు కాకుండా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుచేసి పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. వాటిని పెట్టేందుకు విదేశీ పెట్టుబడిదారులు అమరావతికి రావాల్సి ఉంటుందని, వారికి విమానాశ్రయ అనుసంధానత కోసం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని సీఎం నిర్ణయించారన్నారు. ఏడాదిలోగా అధికారుల నివాసాలు పూర్తి చేస్తామని, ఏడాదిన్నరలోగా ట్రంకు రోడ్లు, రెండున్నరేళ్లలో లేఅవుట్ రోడ్లు, మూడేళ్లలో ఐకానిక్ భవనాలను నిర్మిస్తామన్నారు.