ఉగాది పండుగ సందర్భంగా ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాలో మతసామరస్యం వెల్లివిరుస్తోంది. జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి ఉగాది పండుగ రోజున ముస్లింలు పూజలు చేస్తారు. శ్రీ విశ్వావసు నామ ఉగాది సందర్భంగా ముస్లిం మహిళలు ఇక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక పురాణాల ప్రకారం వెంకటేశ్వరస్వామి... ముస్లిం ఆడపడుచు అయిన బీబీ నాంచారమ్మను పెళ్లాడాడని చెప్పుకుంటారు. అందుకే, బీబీ నాంచారమ్మ తమ ఇంటి ఆడబిడ్డ అని, వెంకటేశ్వరస్వామి తమ ఇంటి అల్లుడు అని ముస్లింలు భావిస్తారు. ఈ నేపథ్యంలో.. ప్రతి ఉగాది రోజున ముస్లింలు దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముస్లింలు తరతరాలుగా ఉగాది నాడు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.