నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ - SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది. ప్రమాదం జరిగిన 11 రోజులకు టన్నెల్‌లోని కన్వేయర్ బెల్ట్‌ను టెక్నికల్ టీమ్ రీస్టార్ట్ చేసింది. కన్వేయర్ బెల్ట్ పనిచేస్తుండటంతో బురద, మట్టి తొలగింపు పనులు వేగవంతమయ్యాయి. ప్రమాదం వల్ల టన్నెల్‌లో కన్వేయర్ బెల్డ్ పూర్తిగా ధ్వంసమైంది. దీన్ని 2 రోజుల పాటు కష్టపడి ఇంజినీర్లు పునరుద్ధరించారు. కన్వేయర్ బెల్టు పనిచేస్తుండడంతో గంటలోనే 800 టన్నుల మట్టి, బురదను బయటికి తీసుకొచ్చారు. అయితే, టన్నెల్‌లో 200 అడుగుల మేర మట్టి, బురద, రాళ్లు, సెగ్మెంట్, టన్నెల్ బోరింగ్ మెషీన్ విడి భాగాలు ఉన్నాయి. టీబీఎం విడి భాగాలను గ్యాస్ కటర్‌తో కట్ చేసి.. వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకొస్తున్నారు. మట్టి, బురద కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి వస్తోంది. దాదాపు 6 వేల క్యూబిక్ మీటర్ల పూడికను టన్నెల్ నుంచి తొలగించాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు.