కాకినాడ జిల్లాలో ఓ కారు ఇద్దరు కానిస్టేబుళ్లపై నుంచి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. న్యూ ఇయర్ సందర్భంగా మంగళవారం రాత్రి జగ్గంపేట పోలీసులు కిర్లంపూడి మండలం కృష్ణవరం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా దగ్గర వాహనాల తనిఖీ చేపట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు ఓ కారు వెళుతోంది. సాధారణ తనిఖీల్లో భాగంగానే పోలీసులు ఆ కారును కూడా ఆపారు. దాన్ని రోడ్డు పక్కన ఆపుతున్నట్లు నటించిన డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు. అంతే ముందు నిలబడిన కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ రాజి లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్‌ను ఢీకొడుతూ కారు దూసుకెళ్లిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లోవరాజు అపస్మారక స్థితికి చేరుకోవడంతో తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. మరో కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.