తెలంగాణలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబరు 15 నుంచి కొనుగోళ్లు ప్రారంభించి రూ.18,250 కోట్ల అంచనా విలువతో 65 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రేడ్-ఏ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 చెల్లించనున్నారు. ఏడు సన్న రకాలకు అదనంగా రూ.500 బోనస్ ఇవ్వనున్నారు. నవంబరు, డిసెంబరులో ధాన్యం రాక అధికంగా ఉండే అవకాశం ఉండటంతో గోదాములు, గన్నీ సంచులు, రవాణా వాహనాలు తదితరాలను ముందుగానే సిద్ధం చేస్తున్నారు.