తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ నాగసాధును పోలీసులు మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఇటీవల అఘోరిని పెళ్లి చేసుకున్న వర్షిణిని కూడా అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. పూజల పేరిట రూ.10 లక్షలు తీసుకుని మోసం చేసిందని.. అడిగితే బెదిరింపులకు పాల్పడిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు మోకిలా పోలీసులు అఘోరీపై చీటింగ్, బెదిరింపుల కేసులు నమోదు చేశారు. అఘోరిని అరెస్టు చేసిన పోలీసులు నేడు దాదాపు రెండు గంటల పాటు విచారించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, అనంతరం కోర్టులో హాజరు పరచారు. అరెస్టుపై స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడిన అఘోరి.. చట్టం తన పని తాను చేస్తుందని చెప్పారు. తాను పోలీసులకు, కోర్టుకు సహకరిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం తాను జైలుకు వెళ్ళినా.. తన భార్య వర్షిణి తనతోనే ఉంటుందని తెలిపింది.