సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. అర్ధరాత్రి మద్యం దొరికే ప్రదేశాలు, అశ్లీల వెబ్‌సైట్లు, వ్యభిచార కేంద్రాలంటూ అసభ్యకర వీడియోలను పోస్టు చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. ఇలా అడ్డదారులు తొక్కుతున్న వారిలో డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సమాజంలో చిచ్చుపెట్టేలా, నేరాలను ప్రోత్సహించేలా పోస్టులు పెట్టే వారిపై పోలీసులు సైబర్ పెట్రోలింగ్ ద్వారా నిఘా పెట్టారు. ఈ ఏడాది నాలుగు కమిషనరేట్లలో కలిపి ఇప్పటివరకు సుమోటోగా 456 కేసులు నమోదు చేశారు.